రుణమాఫీ ఎప్పటివరకు!
ఖరీఫ్ సీజన్ వరకా.. రబీ వరకా?.. కటాఫ్ తేదీపై రైతుల్లో ఉత్కంఠ
ఎన్నికల తేదీ వరకు తీసుకోవాలని డిమాండ్
ఒకేసారి చేస్తారా? లేదా అన్న సందేహం
ఎన్నికల వేళ సీఎం కేసీఆర్ ప్రకటించిన రైతు రుణాల మాఫీపై రైతులకు స్పష్టత కరువైంది. ఏ తేదీని కటాఫ్‌గా తీసుకుంటారు? ఎప్పటివరకు రుణమాఫీ అమలు చేస్తారు? ఒకే దఫాలో చేస్తారా? గతంలో చేసినట్లుగా నాలుగు దఫాలుగా చేస్తారా? వంటి సందేహాలు తలెత్తుతున్నాయి. టీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తానని ఎన్నికల ముందు కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇదే అంశాన్ని టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చేర్చారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అప్పట్నుంచి శాఖలవారీగా సీఎం కేసీఆర్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే వ్యవసాయ శాఖపై మాత్రం ఇంకా సమీక్ష జరగలేదు. రుణమాఫీ ప్రక్రియపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. 2014లో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ చేశారు.
అప్పట్లో 35.29లక్షల మందికి రూ.16,125కోట్లను మాఫీ చేశారు. దాన్ని నాలుగు దఫాలుగా చెల్లించారు. నాలుగో విడత డబ్బును మళ్లీ రెండు భాగాలుగా ఇచ్చారు. గతంతో పోలిస్తే ఇప్పుడు రైతు రుణాలు రూ.20వేల కోట్లకుపైగా ఉండే అవకాశం ఉంది. రుణాలు పొందిన రైతుల సంఖ్య సుమారు 40 లక్షల వరకు ఉంటుందని సమాచారం. అయితే వీరందరికీ రుణమాఫీని ప్రభుత్వం ఏకకాలంలో చేస్తుందా? గతంలో మాదిరిగా నాలుగు దఫాలుగా చేస్తుందా అనే విషయం తేలాల్సి ఉంది. గతంలో విడతలవారీగా రుణమాఫీ చేసినప్పుడు బ్యాంకర్లు చాలా కొర్రీలు పెట్టారు. రైతులను పలు రకాలుగా ఇబ్బందులు పెట్టారు. దీంతో ఏకకాలంలో రుణమాఫీ చేస్తేనే బ్యాంకర్లతో తలనొప్పి లేకుండా ఉంటుందనే ఆలోచనలో రైతులు ఉన్నారు. ఈ పథకానికి వచ్చే బడ్జెట్(2019-20)లో కేటాయింపులు చేస్తారా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
కటాఫ్ తేదీపైనే టెన్షన్
రుణమాఫీ ఎప్పుడు చేస్తారనేది ఒకెత్తయితే.. కటాఫ్ తేదీ ఎప్పటివరకు తీసుకుంటారనేది ఇప్పుడు మరో సందేహం. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో ఇచ్చిన అప్పుల వరకే మాఫీ చేస్తే లబ్ధిదారుల సంఖ్య తక్కువగా ఉంటుంది. రబీ సీజన్ వరకు పరిగణనలోకి తీసుకుంటే ఎక్కువ మందికి లబ్ధి చేకూరుతుంది. రబీ సీజన్‌లో బ్యాంకర్లు సకాలంలో రుణాలు ఇవ్వలేదు. దీంతో ఇంకా రుణాల పంపిణీ పూర్తి కాలేదు. కాబట్టి ఖరీఫ్ సీజన్ వరకే కటాఫ్ తీసుకుంటే నష్టపోతామని, ఎన్నికల తేదీని గానీ, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తేదీనిగానీ కటా్‌ఫగా తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Post a Comment