నేడు కేటీఆర్, జగన్ భేటీ.. జరగబోయేది ఇదేనా..?
ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ ఎంట్రీ ఖాయమైనట్టేనా? వైసీపీకి ఓటేయమని ఏపీలో టీఆర్‌ఎస్ ప్రచారం షురూ చేయనుందా? టీఆర్‌ఎస్ ఎంట్రీతో రాజకీయంగా లాభపడేదెవరు? నష్టపోయేది ఎవరు? ఈ సందేహాలన్నింటికీ తాజాగా జరిగిన ఓ పరిణామం కారణమయింది. కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ గురించి వైసీపీతో చర్చించాలని నిర్ణయించారు. అంతేకాదు, కేటీఆర్ ఇదే అంశంపై నేడు జగన్‌తో స్వయంగా భేటీ కానున్నారు. ఈ పరిణామంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ కేసీఆర్ ఫ్రంట్‌కు జగన్ మద్దతిస్తే ఏం జరుగుతుంది? మద్దతు ఇవ్వకపోతే కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఇలా అనేక సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలపై ప్రత్యేక కథనం.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరని అంటుంటారు. టీఆర్‌ఎస్, వైసీపీ దోస్తీతో ఈ విషయం మరోసారి రుజువైంది. ఒకప్పుడు తెలంగాణలో జగన్ పర్యటననే అడ్డుకున్న టీఆర్‌ఎస్ పార్టీ.. నేడు అదే జగన్‌తో చర్చలకు సిద్ధం కావడంపై హాట్‌హాట్‌గా చర్చ జరుగుతోంది. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని స్పష్టంగా చెబుతున్న గులాబీ పార్టీ ఏపీ పొలిటికల్ ఎంట్రీ ఖాయమైనట్టే కనిపిస్తోంది. అయితే.. రాష్ట్ర విభజన పరిణామంతో కాంగ్రెస్‌కు డిపాజిట్లు గల్లంతు చేసిన ఏపీ ప్రజలు కేసీఆర్ ఎంట్రీని ఎంతవరకూ స్వాగతిస్తారనేది కూడా సందేహమే. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. టీడీపీ భాగస్వామ్యంతో ఏర్పడిన కూటమికి ఓటేస్తే అమరావతి నుంచే పాలన సాగిస్తారని, ప్రతీ నిర్ణయం చంద్రబాబు ఆమోద ముద్రతోనే తీసుకుంటారని.. మళ్లీ ఏపీ పాలకుల చేతిలో తెలంగాణను పెడదామా అని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్-టీడీపీ పొత్తుపై ప్రజలను ప్రశ్నించారు. ఈ ప్రచారం కూడా ప్రజాకూటమిని ఎంతోకొంత దెబ్బ తీసిందని చెప్పక తప్పదు. ఇదే వ్యూహాన్ని టీడీపీ అనుసరిస్తే వైసీపీకి రాజకీయంగా నష్టం చేకూరే అవకాశం ఉందనే వాదన కూడా వినిపిస్తోంది.
రాష్ట్ర విభజనకు కారణమైన, ఏపీకి ప్రత్యేక హోదా పట్ల విముఖంగా ఉన్న టీఆర్‌ఎస్‌తో కలిసి జగన్ అడుగులేయడాన్ని సమర్థిస్తారా అని టీడీపీ ఒకవేళ ప్రచారం చేస్తే వైసీపీకి ఓటేయాలని భావిస్తున్న కొందరు తటస్థ ఓటర్లు కూడా వైఖరి మార్చుకునే అవకాశం లేకపోలేదనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. బీజేపీ వెనక ఉండి టీఆర్ఎస్, వైసీపీల సాయంతో ఏపీ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తోందనే వాదనను టీడీపీ ఇప్పటికే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ఈ వాదనను నమ్మరని కూడా కచ్చితంగా చెప్పలేం. ఇలా ఏ విధంగా చూసినా టీఆర్‌ఎస్ ఏపీ పొలిటికల్ ఎంట్రీ రాజకీయంగా తమకే కలిసొస్తుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అయితే... వైసీపీ కూడా టీఆర్ఎస్ మద్దతును తమకు అనుకూలంగా మార్చుకోవాలని ఇప్పటికే వ్యూహాలు రచిస్తోంది.
ఇటీవల కేసీఆర్ మాట్లాడుతూ.. అవసరమైతే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రానికి లేఖ కూడా రాస్తామని చెప్పారు. నేడు కేటీఆర్ భేటీ కానున్న సందర్భంగా జగన్ ఈ విషయాన్ని ప్రస్తావించే అవకాశముంది. టీఆర్‌ఎస్ తరపున ఏపీకి హోదా కోసం లేఖ ఇప్పించి ఏపీ ప్రజల్లో టీఆర్‌ఎస్‌పై ఓ సానుకూల భావనను కలిగించేందుకు వైసీపీ పావులు కదుపుతోంది. తద్వారా టీఆర్‌ఎస్ కూడా హోదాకు మద్దతిస్తే ఎంపీల బలం పెరుగుతుందని.. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏపీకి హోదా ఇస్తేనే మద్దతిస్తామని డిమాండ్ చేస్తామని వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేయాలనేది వైసీపీ ఆలోచనగా కనిపిస్తోంది. ఇలా టీఆర్‌ఎస్ తమతో చేసే దోస్తీతో ఎన్నికల్లో లాభం చేకూర్చుకోవాలని వైసీపీ, టీఆర్‌ఎస్ ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడాన్ని ప్రజలు ఆమోదించే అవకాశం లేదని టీడీపీ భావిస్తున్నాయి.
ఇక ఈ పరిణామాలన్నింటినీ జనసేన పార్టీ ఆసక్తికరంగా పరిశీలిస్తోంది. అయితే.. జగన్‌తో మాత్రమే కాదు.. పవన్‌తో కూడా ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతు కోరుతూ సంప్రదింపులు జరపాలని టీఆర్‌ఎస్ భావిస్తున్నట్లు సమాచారం. పవన్ కూడా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనకు మద్దతు తెలిపితే.. జగన్‌తో పాటు ఒకే వేదిక పంచుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం మరోసారి వేడెక్కింది.
Fff
ReplyDelete