‘బంగారు గుడ్డు పెట్టే బాతును తెలంగాణలో వదిలొచ్చాం’

బంగారు గుడ్డు పెట్టే బాతును తెలంగాణలో వదిలి వచ్చామని సీఎం చంద్రబాబు అన్నారు. అచ్చంపేటలో జరిగిన జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీపై ధ్వజమెత్తారు. మోదీ అన్నీ అవాస్తవాలే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అతితక్కువ అవినీతి ఉన్న రాష్ట్రం ఏపీనేనని వివరించారు. రఫెల్‌ డీల్‌లో అవినీతి చేసినవాళ్లు విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్‌లో తప్పు చేసినవాళ్లను జైల్లో పెట్టినట్లు గుర్తుచేశారు. కానీ మోదీ మాత్రం బ్యాంకులను దోచుకున్నవాళ్లను విదేశాలకు పంపారని ఎద్దేవా చేశారు. పోలవరం నిర్మాణం బాగా చేస్తున్నారని అవార్డు ఇచ్చి.. మరోవైపు సరిగా చేయడం లేదని మోదీ అబద్దం చెబుతున్నారని ఆరోపించారు. మోదీ, కేసీఆర్‌, జగన్‌ కలిసి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
 
ఇరు రాష్ట్రాలకు న్యాయం చేయాల్సిన కేంద్రం విభేదాలు సృష్టిస్తోందని ఫైరయ్యారు. దేశంలో ప్రజాస్వామ్యం లేదన్నారు. ప్రశ్నించినవారిపై ఐటీ దాడులు చేస్తున్నారని వాపోయారు. ఐదు రాష్ట్రాల్లో ఓటమిని కూడా మోదీ సమర్దించుకుంటున్నారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. జగన్ నెత్తిపై సీబీఐ కత్తి వేలాడుతోందన్నారు. అందుకే మోదీ అంటే భయం అని విమర్శించారు. కులం, మతం పేరుతో మోసం చేసేవారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. మోదీది మాటల ప్రభుత్వం, మాది చేతల ప్రభుత్వం అని వివరించారు.
 
చుక్కల భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. ఊరంతా భూమి ఎవరిదని చెబితే వారికే చెందుతుందని వెల్లడించారు. చుక్కలభూములపై అవసరమైతే చట్టంలో మార్పులు చేస్తామని హామీ ఇచ్చారు. రైతుల రుణమాఫీకి కేంద్రం సహాయం అందించలేదని తెలిపారు. దేశంలో రైతులకు రుణమాఫీ ఎక్కడా చేయలేదని పేర్కొన్నారు. కేంద్రం సహకరించి ఉంటే వేగంగా అభివృద్ధి చెందేవాళ్లమని సీఎం చెప్పుకొచ్చారు.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!