వ్యూహం మార్చిన మోదీ... ఈ సారి పోటీ ఇక్కడి నుంచే..?
లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో జాతీయ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఈసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒడిశాలోని పూరీ నుంచి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మేరకు అక్కడి బీజేపీ ఎమ్మెల్యే ప్రదీప్ పురోహిత్ బల్లగుద్దిమరీ చెబుతున్నారు. ‘‘90 శాతం ఈసారి ప్రధాని నరేంద్రమోదీ పూరీ నియోజక వర్గం నుంచే పోటీ చేస్తారు. పూరీ నియోజకవర్గం నుంచి ప్రధానమంత్రి పోటీ చేయాలని ఒడిశా ప్రజలు కోరుకుంటున్నారు. పార్టీ నేతలతో పాటు ప్రధాని సైతం ఇక్కడి నుంచే పోటీచేసేందుకు సుముఖత చూపే అవకాశాలు ఉన్నాయి’’ అని పురోహిత్ పేర్కొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం జగన్నాథ ఆలయానికి నెలవైన పూరీ నుంచి మోదీని పోటీచేయించేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోందంటూ ఊహాగానాలు వస్తున్న తరుణంలోనే పురోహిత్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
‘‘2014 ఎన్నికల సమయంలో జగన్నాథుడి ఆశీస్సులు తీసుకున్న ప్రధానమంత్రి వారణాసి నుంచి పోటీ చేసి అఖండ విజయం సాధించారు. ఆయన ఒడిశా ప్రజలు, ఇక్కడి అభివృద్ధిని ప్రేమిస్తారు కాబట్టి ఈ సారి కచ్చితంగా పూరి వైపే మొగ్గుచూపుతారు..’’ అని పురోహిత్ పేర్కొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ప్రధాని మోదీ ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సైతం ఈ విషయం ప్రస్తావనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఊహాగానాలన్నీ మీడియో సృష్టేనంటూ ప్రధాని కొట్టిపారేసినప్పటికీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వంపై పురోహిత్ ఇలా వ్యాఖ్యానించడం విశేషం. గత ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేసిన నరేంద్రమోదీ... దాదాపు అక్కడి స్థానాలన్నీ కైవసం చేసుకుని లోక్‌సభలో భారీ మెజారిటీ సాధించారు. ఈ సారి ఒడిశా నుంచి పోటీ చేయడం ద్వారా అక్కడ కూడా పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నట్టు కనిపిస్తోంది.
Comments
Post a Comment