జై అనుసంధాన్‌!

జై జవాన్‌- జై కిసాన్‌కు మోదీ జోడింపు
రైతుల కోసం పరిశోధనలు
కరవు కాటకాలను తట్టుకునేలా, విపత్తును గుర్తించేలా ఎదగాలి
జీవన ప్రమాణ సూచీ పెరగాలి
సైబర్‌ ఫిజికల్‌కు 3600 కోట్లు
ప్రధాని మోదీ ఉద్ఘాటన
సైన్స్‌ కాంగ్రె్‌స ప్రారంభం

ఆవిష్కరణల రూపంలో రైతులకు, సామాన్యులకు శాస్త్రసాంకేతిక ఫలాలు అందినప్పుడే అభివృద్ధి దిశగా మరింత వేగంగా అడుగులు పడతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ‘‘దేశంలో వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. అందులోనూ చిన్నకమతాలు సాగు చేసేవారి సంఖ్య మరింత ఎక్కువ. వారికి ఉపయోగపడే విధంగా ఆవిష్కరణలు రావాలి. ప్రజల జీవన సౌలభ్యం కోసం శాస్త్రవేత్తలు మరింత కష్టపడాలి. తక్కువ వర్షపాతం పడే ప్రాంతాల్లో కరవు నివారణ- నిర్వహణ జరగాలి. విపత్తులను ముందుగానే గుర్తించే వ్యవస్థను సిద్ధం చేయాలి, పోషకాహార లోపాన్ని లేకుండా చేయాలి. మెదడువాపు వంటి వ్యాధుల బారిన చిన్నపిల్లలు పడకుండా ఉండేలా చూడాలి. శుద్ధమైన నీరు అందించాలి. సైబర్‌ సెక్యూరిటీ పరిశోధనలు పెరగాలి. వీటన్నింటికీ నిర్ణీత కాలంలోనే పరిష్కారం లభించేలా పరిశోధనలు జరగాల్సి ఉంది’’ అని ప్రధాని పిలుపునిచ్చారు. జలంధర్‌లోని లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీలో గురువారం 106వ భారతీయ సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశాల్ని ఆయన ప్రారంభించారు. ఈ ఏటి అంశం: ‘‘ఫ్యూచర్‌ ఇండియా- సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ’’. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో దాదాపు 3000 మంది శాస్త్రవేత్తలు, ఆరగురు నోబెల్‌ గ్రహీతలు పాల్గొంటున్నారు.
 
డాటా అనాలసిస్‌, కృత్రిమ మేధ, బ్లాక్‌చైన్‌ వంటి టెక్నాలజీలను రైతులకు ఉపయోగపడేలా చేయాలని ప్రధాని సూచించారు. వీటితోపాటు ఆరోగ్య సంరక్షణ, ఇళ్ల నిర్మాణం, వాయు శుద్ధి, నీరు, విద్యుత్తు వంటి వాటిల్లో ఉండే సమస్యలను పరిష్కరించేందుకు శాస్త్రవేత్తలు తమకుతామే లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేయాలని పిలుపునిచ్చారు. మాజీ ప్రధాని లాల్‌బహుదూర్‌ శాస్త్రి జైకిసాన్‌, జైజవాన్‌ అని పిలుపు ఇచ్చారని, ఎన్డీయే తొలి ప్రధాని వాజ్‌పేయ్‌ దానికి అదనంగా జై విజ్ఞాన్‌ అని జోఢించారని, దానికి ఇప్పుడు జై అనుసంధాన్‌ అనే నినాదాన్ని జోడిస్తున్నట్లు ప్రకటించారు.
 
‘‘2018లో మనం చాలా సాంకేతిక విజయాలు సాధించాం.. ప్రధానంగా విమానాలకు జీవ ఇంధన ఉత్పత్తి, దృష్టిలోపాలున్న వారికి దివ్యనయన్‌ ద్వారా యంత్ర పరిష్కారం చూపడం, గర్భాశయ కేన్సర్‌, టీబీ, డెంగ్యూ ఉన్నవారికి చికిత్సలకు చవకైన ఉపకరణాలు అందించండి, సిక్కిం, డార్జిలింగ్‌ వంటి ప్రాంతాల్లో విపత్తులను ముందస్తుగా గుర్తించే వ్యవస్థ ఏర్పాటు వంటి ఎన్నో విజయాలన్నాయి’’ అని మోదీ వెల్లడించారు. పరిశోధనాత్మక సైన్స్‌ ఎకోసిస్టమ్‌ని పటిష్ఠం చేసుకోవడంతోపాటు కొత్త ఆవిష్కరణలకు, స్టార్ట్‌పలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
 
ఆ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం అటల్‌ ఇన్నోవేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిందని, దీని ద్వారా గడిచిన 40 ఏళ్లలో కంటే ఎక్కువ ఇంకుబేషన్లను, ఆవిష్కరణలు నాలుగేళ్లల్లో సాధ్యమైందన్నారు. ప్రధానమంత్రి ఫెలోషిప్స్‌ ద్వారా వెయ్యి మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఐఐటీలు, ఐఐఎస్‌సీ వంటి వాటిలో నేరుగా పీహెచ్‌డీ అడ్మిషన్‌ లభిస్తుందని తెలిపారు. తద్వారా సమాజహిత పరిశోధనలకు ఊతం లభిస్తుందన్నారు. రూ.3600కోట్ల పెట్టుబడితో నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఇంటర్డిసిప్లినరీ సైబర్‌ ఫిజికల్‌ సిస్టమ్స్‌కు కేంద్రం ఆమోదం తెలిపిందని ప్రకటించారు. రాష్ట్ర వర్సిటీల్లోనూ, కళాశాలల్లో ఉన్నతస్థాయి పరిశోధన జరగాలని, సమాజానికి చాలా అవసరమన్నారు. ‘సులభతరవాణిజ్యంలో భారత్‌ ముందుంది.. జీవన ప్రమా ణ సూచిలో మెరుగుపడాల్సి అవసరం ఉంది. దీంట్లో శాస్త్రసాంకేతిక పాత్ర కీలకం’ అని మోదీ పేర్కొన్నారు.
 
నోబెల్‌ గ్రహీతలతో చాయ్‌పే చర్చ
నోబెల్‌ బహుమతి అందుకున్న బయోకెమిస్ట్‌ థామస్‌ సడోఫ్‌ ఉపన్యాసం కూడా ఉంది. ఆయనతోపాటు రసాయనశాస్త్రంలో నోబెల్‌ సాధించిన అవ్రం హెర్ష్కో, ఫిజిక్స్‌లో అవార్డు పొందిన ఫ్రెడరిక్‌ డంకన్‌ మైఖల్‌ హాల్డేన్‌లతో ప్రధాని చాయ్‌పే చర్చ కార్యక్రమంతో ముచ్చటించారు. వారు చేసిన ఆవిష్కరణలు, మానవాళి హితానికి ఎలా ఉపయోగపడతాయి.. మొదలైనవి చర్చించారు.
 
 
డ్రైవర్‌ రహిత బస్సులో వచ్చిన మోదీ
ఎల్‌పీయూ ప్రాంగణంలోకి వచ్చిన ప్రధాని డ్రైవర్‌ రహిత బస్సులో వేదిక వరకూ రావడం విశేషం. పూర్తిగా సౌర విద్యుత్‌తో పనిచేసే ఈ బస్సులో 30 మంది ప్రయాణిం చవచ్చు. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. యూనివర్సిటీ ప్రొఫెసర్ల పర్యవేక్షణలో రూ.6 లక్షల వ్యయంతో 300 మంది మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు దీనికి రూపకల్పన చేశారు. పూర్తిగా కాలుష్య-రహితమైన ఈ బస్సుకు జీపీఎస్‌ నావిగేషన్‌ ఉంది. వీటూవీ టెక్నాలజీతో దీన్ని రూపొందించారు.


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!