హైదరాబాద్‌లో నాలుగు హోటళ్లు సీజ్
కంపోస్ట్ పిట్‌లు ఏర్పాటు చేయకపోవడమే కారణం
నిబంధనల అమలుపై కఠినంగా వ్యవహరిస్తోన్న జీహెచ్‌ఎంసీ
నిబంధనల అమలులో జీహెచ్‌ఎంసీ నిక్కచ్చిగా వ్యవహరిస్తోంది. నిన్న, మొన్నటి వరకు రోడ్లపై నీరు వదిలిన వారిపై యాక్షన్ చేపట్టిన సంస్థ.. తాజాగా హోటళ్లపై దృష్టి సారించింది. కంపోస్ట్ పిట్‌లు ఏర్పాటు చేయలేదని శనివారం నాలుగు హోటళ్లను జీహెచ్‌ఎంసీ అధికారులు సీజ్ చేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సమగ్ర వ్యర్థాల నిర్వహణ నిబంధనల ప్రకారం నిత్యం 50 కిలోల కంటే ఎక్కువ పరిమాణంలో చెత్త ఉత్పత్తి చేసే హోటళ్లు సేంద్రియ ఎరువుల ఉత్పత్తికి ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు గతంలోనే కంపోస్ట్ పిట్‌లు ఏర్పాటు చేసుకోవాలని హోటళ్లకు జీహెచ్‌ఎంసీ నోటిసులు ఇచ్చింది.
మొదట ఆగస్టు 15 వరకు గడువిచ్చిన అధికారులు.. హోటల్ యాజమాన్యాల విజ్ఞప్తితో కొన్నాళ్ల పాటు పొడిగించారు. పొడిగింపు గడువు కూడా ముగియడం.. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే జరగనున్న నేపథ్యంలో తనిఖీలకు శ్రీకారం చుట్టారు. కూకట్‌పల్లి జోన్ పరిధిలోని గ్రీన్ బావర్చి, ఘుమఘుమలు హోటల్, మూసాపేట సర్కిల్‌లోని కోహినూర్, అరేబియన్ హోటళ్లను కంపోస్ట్ పిట్‌లు లేని కారణంగా సీజ్ చేసినట్టు డిప్యూటీ కమిషనర్లు మమత, సామ్రాట్ తెలిపారు. తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు పాటించని ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆ హోటళ్లకు ట్రేడ్ లైసెన్స్, ఫైర్ సేఫ్టీ లేదని, కిచెన్‌లూ అపరిశుభ్రంగా ఉన్నాయని జీహెచ్‌ఎంసీ వర్గాలు తెలిపాయి.
Comments
Post a Comment