బ్రేకింగ్: కీలక బిల్లుకు లోక్‌సభ ఆమోదం
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పౌరసత్వ సవరణ బిల్లు-2019కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ నుచి వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరస్వత్వం ఇచ్చేందుకు ఈ బిల్లు ఉద్దేశించారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం చర్చ జరిగింది. బిల్లు వల్ల మతపరమైన మైనారిటీలు- హిందువులు, జైనులు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలు కూడా భారత పౌరసత్వం పొందుతారని చెప్పారు.
ఈ బిల్లుపై పలు విపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. చాలా రాష్ట్రాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నందున దీనిని సెలక్ట్ కమిటీకి పంపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అయితే కాంగ్రెస్ డిమాండ్‌ను స్పీకర్ సుమిత్రా మహాజన్ పట్టించుకోకపోవడంతో ఆ పార్టీ ఎంపీలు వాకౌట్ చేశారు. ఇది విభజించే బిల్లు అని, రాజ్యాంగ మౌలిక లక్షణాలకు వ్యతిరేకమని టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్ చర్చ సందర్భంగా వాదించారు. దీనిపై రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ, ప్రతిపాదిక చట్టం అసోంకు మాత్రమే పరిమితం కాదని, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకూ, కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తిస్తుందని చెప్పారు. ఈ బిల్లుతో దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా లబ్ధిదారులు నివసించేందుకు వెసులుబాటు ఉంటుందని చెప్పారు. కాగా, 2016లోనే ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టి, ఆ తర్వాత జేపీసీకి పంపారు. జేపీసీ సోమవారంనాడు నివేదిక అందజేసింది. జేపీసీ సిఫారసుల మేరకు తాజా బిల్లును ఇవాళ లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టింది. చర్చానంతరం బిల్లు సభామోదం పొందింది.
Comments
Post a Comment